ఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డగించడం, అదుపులోకి తీసుకోవడం, దాడి చేయడం వంటి చర్యలను సవాల్ చేస్తూ నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా తో పాటు మరికొన్ని మీడియా సంస్థలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. పోలీసుల చర్యలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
ఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డగించడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, భౌతికంగా దాడి చేయడం వంటి చర్యలను సవాల్ చేస్తూ నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా తో పాటు మరికొన్ని మీడియా సంస్థలు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.
పోలీసుల ఈ చర్యలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19(1)(భావప్రకటన స్వేచ్ఛ/పత్రికా స్వేచ్ఛ), ఆర్టికల్ 19(1) (సంచరించే స్వేచ్ఛ), మరియు ఆర్టికల్ 21 (జీవించే హక్కు - వ్యక్తిగత స్వేచ్ఛ) లకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
జర్నలిస్టుల పట్ల దురుసు ప్రవర్తన
నిరసనలను కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ పరంజోయ్ గుహా ఠాకుర్తా తన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గుర్తింపు కార్డును చూపించినప్పటికీ, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా, నిర్బంధానికి గల కారణాలను తెలపకుండా, తగిన పత్రాలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఢిల్లీలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కనీసం 35 మందికి పైగా జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ నివేదికను పిటిషన్లో ఉదహరించారు.
ప్రజాస్వామ్య యుతంగా వార్తలు సేకరించే జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని, భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసేందుకు సుప్రీంకోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలని మీడియా సంఘాలు కోరాయి.












