కరీంనగర్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు పొత్తూరు శేఖర్, సంపత్‌లను తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్, ఫోరం నాయకులు పరామర్శించారు. గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ వీరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫోరం ఆరోపించింది.
గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్, జర్నలిస్టులు పొత్తూరు శేఖర్, సంపత్‌లను కరీంనగర్ నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం ఆరోపించింది. కోర్టులో హాజరుపరిచిన సమయంలో వారి గాయాలను గమనించిన న్యాయమూర్తి, వారి స్టేట్మెంట్ నమోదు చేసుకుని, రిమాండ్‌ను తిరస్కరించి ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.
ప్రస్తుతం వీరు కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ఫోరం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎస్సై శ్రీకాంత్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పరామర్శలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లేపాక రాజేష్, రాష్ట్ర గౌరవ సలహాదారులు సుంచు లింగయ్య, ప్రేమ్ కుమార్, రాష్ట్ర కోశాధికారి బొట్ల సదానందం, రాష్ట్ర సహాయ కార్యదర్శి అనిల్, కొట్టేపల్లి గంగరాజు, జిల్లా ఇన్చార్జి లంక స్వామి, కే. ఎల్లయ్య, కొండ్ర శంకర్, జింక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.












