జగిత్యాల, 14 November
జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వివిధ రకాల వేషధారణలతో చిన్నారులు అలరించగా, జానపద, శాస్త్రీయ, దేశభక్తి గీతాలపై ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల అద్భుతమైన నృత్యాలు, వినూత్న విన్యాసాలు, సృజనాత్మక ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, పోషకులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవ వేడుకలు ఉల్లాసభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలలే దేశ భవిష్యత్తు అని, వారి చేతుల్లోనే రేపటి సమాజ నిర్మాణం ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక, సమయపాలన, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. పుస్తక జ్ఞానంతో పాటు ఆటలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆసక్తి కనబరచాలని తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశయాలను నెరవేరుస్తూ మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరిచరణ్ రావు, మౌనిక, రజిత, సుమన్ రావు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.






