రాజన్న సిరిసిల్ల, 2026-07-31
భవాని మరముగ్గముల పారిశ్రామికుల సంఘం బ్యాంకు ఖాతాలో చెక్ పవర్ మార్పు వ్యవహారంలో చేనేత & జౌళి శాఖ అధికారులపై బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన సమావేశాలు, ఎన్నికల ప్రక్రియ లేకుండానే కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలో మార్పులు చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార శాఖ అధికారి (DCO)ని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. భవాని మరముగ్గముల పారిశ్రామికుల ఉత్పత్తి అండ్ విక్రయముల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్, వెంకంపేట, సిరిసిల్ల (Reg. No. AMC/KARIMNAGAR/DCO/2002/357) సంబంధించిన సంఘంలో ఎటువంటి జనరల్ బాడీ సమావేశం, కార్యవర్గ సమావేశం నిర్వహించకుండా, ఎన్నికల నోటిఫికేషన్ లేకుండా, ఎన్నికల అధికారిని నియమించకుండా, అధ్యక్షునికి సమాచారం ఇవ్వకుండా, సంఘం యొక్క బైలాలను పట్టించుకోకుండా, శ్రీ అన్నల్దాస్ పర్శరాములు, స్వర్గం సత్తయ్య, బీమనపల్లి సునీత లను సంఘం యొక్క ఒరిజినల్ మినిట్స్ బుక్‌లో నమోదు లేకుండానే, కేవలం తెల్ల కాగితాలపై కొందరు తప్పుగా తీర్మానాలు సృష్టించి, సంతకాలు సేకరించిన వాటిని అడ్డంగా పెట్టుకుని, ఒరిజినల్ మినిట్ బుక్‌ను తనిఖీ చేయకుండా వ్యవహరించారని ఆరోపించారు.
చేనేత & జౌళి శాఖ సిరిసిల్ల అధికారులు చట్టబద్ధమైన రికార్డులను పరిశీలించకుండా, తప్పుడు పత్రాలను ఆధారంగా చేసుకుని, సంఘం యొక్క ఇండియన్ బ్యాంకు ఖాతా యొక్క చెక్ పవర్ మార్పిడికి ఇండియన్ బ్యాంకు వారికి లేఖ ఇచ్చినట్లు తెలిపారు. వీరికి ఎలాంటి సంబంధం లేని, వీరి పరిధిలోకి రాని సహకార సంఘానికి సంబంధించిన చెక్ పవర్ మార్చడానికి అవకాశం కల్పించిన చేనేత మరియు జౌళి శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










