టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో గతంలో విధించిన ఏడాది జైలు శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను ఒంగోలులోని రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, బండ్ల గణేశ్‌ను నాలుగు వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ పరిణామంతో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు న్యాయపరంగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అసలు కేసు వివరాలు
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.95 లక్షల బకాయి చెల్లించాల్సిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. 2018లో జానకి రామయ్య నుంచి బండ్ల గణేశ్ రూ.95 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జానకి రామయ్య మరణం తర్వాత అప్పు తిరిగి చెల్లించేందుకు బండ్ల గణేశ్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది.
2014లో ఏడాది జైలు శిక్ష
ఈ కేసును విచారించిన ఒంగోలులోని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 2014లో బండ్ల గణేశ్‌ను దోషిగా నిర్ధారించింది. ఒక ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95.10 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ.95 లక్షలను ఫిర్యాదుదారుడికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
అప్పీల్ కొట్టివేత.. నాలుగు వారాల గడువు
దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ అప్పీల్ దాఖలు చేశారు. తాజాగా ఆ అప్పీల్‌ను కూడా ఒంగోలు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దిగువ కోర్టు ఇచ్చిన శిక్షను సమర్థిస్తూ నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. గడువులోగా లొంగిపోకపోతే బండ్ల గణేశ్‌ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.






