మధిర మున్సిపాలిటీలోని 17వ వార్డు ప్రజలు గత రెండు నెలలుగా అండర్ డ్రైనేజీ పనుల కోసం తీసిన గుంతల కారణంగా ఇంటికి చేరుకోవడానికి సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన రోడ్లు, డ్రైనేజీ గుంతలు, ఎత్తని మట్టి కుప్పలు, సరైన మట్టి లేకపోవడం వంటి కారణాలతో విద్యుత్ స్తంభాల పక్క నుంచి ప్రమాదకరంగా నడవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రధాన మార్గంలోనూ ఆటంకాలు
ఈ మార్గం 17, 18 వార్డుల ప్రజలు సాయిబాబా గుడికి వెళ్ళడానికి ప్రధానమైనది. ఈ దారిలో కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేంత సందు కూడా లేకపోవడంతో, కొన్ని చోట్ల నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రెండు నెలలుగా ప్రజలు నరకం చూస్తున్నారు. డ్రైనేజీ గుంతలు, మట్టి దిబ్బలు, కాలువ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలతో ఇబ్బందులు పడుతున్నారు.
కమిషనర్‌కు విజ్ఞప్తి
కావున, మధిర మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి, నిర్లక్ష్యం వహించిన అండర్ డ్రైనేజీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని 17వ వార్డు ప్రజలు కోరుతున్నారు.











