మహబూబాబాద్, 2026-06-05
తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా మహబూబాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు అని తెలిసి కూడా వారిని తీవ్రవాదులను అడ్డుకున్నట్టుగా భారీగా పోలీసు బలగాలతో నిలువరించడం, రిజర్వ్ పోలీసులను రంగంలోకి దించడం పట్ల విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా మహబూబాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు అని తెలిసి కూడా వారిని తీవ్రవాదులను అడ్డుకున్నట్టుగా భారీగా పోలీసు బలగాలతో నిలువరించడం, రిజర్వ్ పోలీసులను రంగంలోకి దించడం, కలెక్టరేట్ గేట్ల వద్ద కఠినంగా అడ్డుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, పలు సామాజిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవో నంబర్ 97పై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు వచ్చిన విద్యార్థులను శత్రువులుగా చూడటం కాకుండా వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.
కలెక్టర్‌ను కలవడం కూడా నేరమేనా
విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించేందుకు వెళ్లడం తప్పా తమ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయంపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడం నేరమా అన్న ప్రశ్నలు ఇప్పుడు మహబూబాబాద్ ఘటనతో తెరపైకి వచ్చాయి. విద్యార్థులు అని స్పష్టంగా తెలిసినప్పటికీ వారిని సాధారణ ఆందోళనకారులుగా కాకుండా అత్యంత ప్రమాదకర వ్యక్తులను అడ్డుకున్నట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ మొదలైంది. విద్యార్థుల గొంతు వినాల్సిన సమయంలో వారి గొంతును అణచివేయడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందన్న ప్రశ్న కూడా ముందుకొస్తోంది.
రిజర్వ్ పోలీసులు ఎందుకు
కలెక్టరేట్ వద్ద విద్యార్థులను నియంత్రించేందుకు రిజర్వ్ పోలీసులను కూడా రంగంలోకి దించడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. విద్యార్థులు తమ సమస్యను అధికారులకు చెప్పేందుకు వచ్చిన సమయంలో వారితో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన చోట భారీ పోలీసు బలగాలతో అడ్డుకోవడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులను నియంత్రించే క్రమంలో తోపులాట జరగడం, కొందరు పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు మరింత ఆందోళనకు కారణమయ్యాయి.
మహిళా పోలీసుల లేకుండానే వ్యవహరించడంపై విమర్శలు
ఆందోళనలో విద్యార్థినులు కూడా ఉంటే వారిని నియంత్రించే సమయంలో మహిళా పోలీసు సిబ్బంది తగినంతగా అందుబాటులో లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు పాల్గొన్న ఆందోళనను అత్యంత సున్నితంగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా పోలీసుల సమక్షంలోనే మహిళా విద్యార్థులతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పరిస్థితులు అలా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.












