రంగారెడ్డి, 2017-12-17
షాద్ నగర్ నియోజక వర్గంలోని ఎలికట్ట గ్రామంలో భూదాన్ భూముల వ్యవహారం మరోసారి అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. సుమారు 25 ఎకరాల విలువైన భూములను రియల్టర్లు కబ్జా చేశారని, దీని విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి పొంగులేటి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
షాద్ నగర్ నియోజక వర్గంలో భూదాన్ భూముల పందేరం కొనసాగుతూనే ఉంది. కోట్ల రూపాయల విలువైన భూములను చేజిక్కించుకుని సొమ్ము చేసుకోవాలని భూ బకాసురులు చేయని ప్రయత్నాలు లేవు. ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో భూదాన్ భూమి వ్యవహారంలో జరిగిన ఉదంతం మరో సారి అసెంబ్లీ సాక్షిగా చర్చనీయాంశంగా మారింది. శనివారం మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ఎలికట్ట గ్రామంలోని సుమారు 25 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నా అప్పటి ప్రభుత్వం హెచ్ఎడిఎ అనుమతులు ఇచ్చిందని సాక్షాత్తు ప్రభుత్వమే చర్చకు తెరలేపింది. దీంతో కోట్ల రూపాయల భూ పందేరంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
అధికారులను మచ్చిక చేసుకుని సుమారు 100 కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని కాజేసిన రియల్ వ్యాపారుల వ్యవహారంలో జరిగిన వ్యవహారం ఇది. షాద్ నగర్ నియోజకవర్గ ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలోని సర్వే నెంబరు 191, 193లో రామచంద్రయ్య గౌడ్ కు చెందిన 25 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు ఆకర్షితులై రామచంద్రయ్య గౌడ్ 1972లో భూదాన్ బోర్డుకు తనకున్న 25 ఎకరాల భూమిని స్వాధీనం చేశాడు. నిరుపేద కుటుంబాలకు ఆ భూములను అందించాలనేది ఆయన ఆశయం. ఆయన ఆశయానికి అనుగుణంగానే భూదాన్ యజ్ఞ బోర్డు నిరుపేదలైన రైతులకు భూమిని అప్పగించింది. ఆ భూములలో పేద రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ భూములపై ఓ రియాల్టర్ కన్ను పడింది. ఇంకేముంది పేద రైతులకు డబ్బు ఆశచూపి వారినుండి 191, 193 సర్వే నెంబర్ లోని మొత్తం 25 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నెం. 8372/2005 ద్వారా ఆనంద్ రెడ్డి అనే వ్యాపారి ఏజిపిఏ చేసుకున్నాడు. అలా అధికారులను మచ్చిక చేసుకుని రిజిష్టర్ చేసుకున్న భూములను హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ యజమానికి ఆ భూములను యదేచ్చగా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నాడు. ఇవన్నీ తెలిసే అతని వద్ద భూములు కొన్న కొందరు ఆయా భూములను స్వాదీనం చేసుకుని ఎవరూ రాకుండా కాపలా దారులని పెట్టి తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఉన్నత మైన ఆశయంతో తన తండ్రి రామచంద్రయ్య గౌడ్ దానం చేసిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆలస్యంగా తెలుసుకున్న రామచంద్రయ్య గౌడ్ కుమారులు నర్సింలు గౌడ్, యాదగిరి గౌడ్ లు 2014లో అప్పటి జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించారు. జేసి కోర్టులో విచారణ జరిగిన తరువాత 2017లో సదరు భూములు అన్యాక్రాంతం అయ్యాయని, జరిగిన సేల్ డీడ్లు, రికార్డుల మార్పు పూర్తీగా విరుద్ధమని వెంటనే ఆ రికార్డులను మార్చాలంటూ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ తీర్పు నిచ్చారు. జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 20 నెలలో అప్పటి ఫరూఖ్ నగర్ తహశీల్దార్ రామారావు సదరు భూములకు నర్సింలు, యాదగిరి గౌడ్ లను పట్టదారులుగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఆ తరువాత తెలంగాణా ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చింది. ధరణి పోర్టల్ లో నర్సింలు, యాదగిరి గౌడ్ లను పట్టధారులుగా చూపుతూనే ఆ భూములను నిషేధిత జాబితాలో చూపించారు. ఇందులోనూ ఆ రియాల్టర్ల మాయాజాలం దాగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది.












