హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొండా దంపతుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొండా దంపతుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొని రాయబారం నడిపారు. పార్టీలో తమపై వస్తున్న ఫిర్యాదులు, తాజా వివాదాలపై డిప్యూటీ సీఎంకు కొండా మురళి వివరణ ఇచ్చి, పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానానికి నివేదికలు
కొండా దంపతుల వివాదాస్పద వ్యవహారశైలిపై ఇప్పటికే పీసీసీ, రాష్ట్ర ఇన్ ఛార్జ్‌ల నుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి స్పష్టమైన నివేదికలు చేరాయి. క్రమశిక్షణా ఉల్లంఘనల అంశం నేరుగా హైకమాండ్ పరిధిలోకి వెళ్లడంతో, రాష్ట్ర స్థాయి నేతలు పెద్దగా ఏమీ చేయలేరనే ప్రచారం జరుగుతోంది.
భట్టి సలహా కీలకం
తుది నిర్ణయం తీసుకునే ముందు అధిష్ఠానం రాష్ట్రంలోని ముఖ్య నేతల అభిప్రాయం కోరితే, డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ఇచ్చే సలహా కీలకం కానుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే వ్యూహంతోనే, రాజగోపాల్ రెడ్డి ద్వారా భట్టి విక్రమార్క వద్దకు కొండా మురళి వెళ్లినట్లు చెబుతున్నారు.
భట్టి పాత్రపై ఆసక్తి
పార్టీలో సౌమ్యుడిగా, క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చే నేతగా పేరున్న భట్టి విక్రమార్క ఈ వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిబంధనలను పక్కనపెట్టి కొండా దంపతులకు ఆయన అండగా నిలుస్తారా లేక నిర్ణయాన్ని పూర్తిగా అధిష్ఠానానికే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. రాజగోపాల్ రెడ్డి జరిపిన ఈ మధ్యవర్తిత్వం కొండా దంపతులకు ఏ మేర కలిసివస్తుందో తెలియాలంటే ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాల్సిందే.












