జగిత్యాల, 2026-06-05
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ భూములను పకడ్బందీగా, వేగవంతంగా సర్వే చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత అధికారులను ఆదేశించారు. శనివారం మేడిపెల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో నాన్-కెడస్ట్రాల్ రీసర్వే, ఎంజాయ్మెంట్ రీసర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ భూములను పకడ్బందీగా, వేగవంతంగా సర్వే చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత అధికారులను ఆదేశించారు. శనివారం మేడిపెల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో నాన్-కెడస్ట్రాల్ రీసర్వే, ఎంజాయ్మెంట్ రీసర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రీసర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా, గ్రామంలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో రీసర్వే పూర్తయింది, ఇంకా ఎంత మేర చేపట్టాల్సి ఉంది, పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో భూమి విస్తీర్ణం ఎంత ఉందని ఆరా తీశారు. సర్వే నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఖచ్చితత్వంతో రీసర్వే నిర్వహించాలని సూచించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ రీసర్వేలో భాగంగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక సర్వే పరికరాల సహాయంతో వ్యవసాయ భూములను సర్వే చేయనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం భూ వివరాలను ప్రజలకు ప్రకటిస్తామని పేర్కొన్నారు.
గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా రీసర్వే ప్రక్రియను నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మొదట గ్రామ బౌండరీపై లైసెన్సుడ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లు కలిసి రీసర్వే చేస్తారని తెలిపారు. తర్వాత ఒక్కొక్క రైతు వారీగా రీసర్వే నిర్వహిస్తారని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మొదటి విడతగా 70 గ్రామాల్లో రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం ఎంజాయ్మెంట్ రీసర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. నడికుడ గ్రామంలో నాన్-కెడస్ట్రాల్ రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. రైతులు, గ్రామస్థులు అడిగిన సందేహాలకు తగిన సలహాలు, సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.












