రష్యాఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ మేరకు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.
సుదర్శన్ గౌడ్ కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఉపాధి కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్, అక్కడ కొనసాగుతున్న యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదే సందర్భంగా, ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి అనారోగ్యానికి గురై కాళ్ళు చేతులు కోల్పోయిన అబ్బాడి శ్రీనివాస్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, జిల్లా మండల నాయకులు, ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












