కరువు మండలాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణపై తర్జనభర్జన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకుంటే సహాయ చర్యలు ఎలా చేపట్టాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మండలాల్లో మోస్తరు కరువు ఉందని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధుల కేటాయింపుపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీనిపై ఇప్పుడు ప్రజలు, రైతాంగంలో చర్చ జరుగుతోంది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కరువు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల సహాయాన్ని ప్రకటించాలని కోరింది. దానికోసం త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని కూడా ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో పంట నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించలేదు.
కరువు మండలాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణపై తర్జనభర్జన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకుంటే సహాయ చర్యలు ఎలా చేపట్టాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మండలాల్లో మోస్తరు కరువు ఉందని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధుల కేటాయింపుపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీనిపై ఇప్పుడు ప్రజలు, రైతాంగంలో చర్చ జరుగుతోంది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కరువు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల సహాయాన్ని ప్రకటించాలని కోరింది. దానికోసం త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని కూడా ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో పంట నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించలేదు. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులను ఇవ్వకుంటే పరిస్థితి ఏంటనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల ఆధారంగానే వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపడతారు. మండలాల వారీగా నిధుల కేటాయింపుపై ఇప్పుడు క్షేత్రస్థాయి ప్రజల్లో రాజకీయ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా, ఎల్నినో ప్రభావంతో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగుతో పాటు వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. 18 జిల్లాల్లో సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. రాష్ట్రంలో 139.28 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం 126.06 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే 13.22 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది. వరి సాగు కూడా 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు తగ్గింది. అంటే వరి పంట విస్తీర్ణం 12.19 లక్షల ఎకరాలు తగ్గింది. రైతులు పంట వేసినా నీరు, విద్యుత్ కొరతతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, పంట నష్టానికి సంబంధించిన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరాలి. ఆ తర్వాత కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించాలి. ఆ తర్వాతే కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం నిధులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు వచ్చాకే పంట నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పంట నష్ట పరిహారం ఇప్పట్లో అందడం కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించినా, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు కేంద్రం నుంచి వివిధ స్కీములు, ప్రోత్సాహకాలు, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రావాల్సిన నిధుల్లో 25 శాతం కూడా రాలేదని ఇప్పటికే కాగ్ ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎన్డీఎంఐఎస్), 16వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2026-27 నుంచి 2030-31 వరకు తెలంగాణకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.2,959 కోట్లు కేటాయించాలని సిఫారసు చేశారు. ఇందులో 2026-27 సంవత్సరానికి రూ.536 కోట్లు ఉన్నాయి. అయితే, వీటి విడుదలకు కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఎస్డీఆర్ఎఫ్ నిధులను కరువుతో సహా ప్రకటించిన విపత్తుల బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు వినియోగించాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, పశువుల సంరక్షణ, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన బాధితులకు సహాయం వంటి చర్యలు ఉంటాయి. గ్రామీణ ఉపాధి హామీ పనులను విస్తరించడం, వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.











