సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను విశ్లేషించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను విశ్లేషించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చేపట్టాల్సిన చర్యలు, జాతీయ రహదారులపై రోడ్డు భద్రత మెరుగుదల పనుల పురోగతిపై సమీక్షించారు.
కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలో సుమారు 600 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయని, వీటిపై గత నెల రోజుల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి అనే వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను విశ్లేషించాలన్నారు.
ఇకపై జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించాలని సూచించారు. ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలను గుర్తించి, భవిష్యత్తులో అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టమైన సూచనలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
వచ్చే వారం, 10 రోజులలో మరోసారి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అప్పటిలోగా ఆర్బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గత మూడు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ నివేదిక సమర్పించాలని తెలిపారు. ప్రమాద ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను తొలగించడం, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, వేగ సూచిక బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
రోడ్డు భద్రత మెరుగుదల పనులకు అవసరమైన నిధుల అంచనాలను వెంటనే రూపొందించి, పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో దాదాపు సగం జాతీయ రహదారులపైనే చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలని, జాతీయ రహదారులపై తక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని కలెక్టర్ హెచ్చరించారు.












