సూర్యాపేట జిల్లా మండలం రత్నవరం గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ముందుగా సంఘం జెండాను సీనియర్ నాయకులు మిర్యాల గురవయ్య ఆవిష్కరించారు. కల్లుగీత కార్మిక సంఘం మొదటినుండి కల్లుగీత కార్మికులకు సారధిగా, వారధిగా, రథసారథిగా ఉంటూ సమరశీల పోరాటాలు చేస్తుందని, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులు 37,381 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ ఎటువంటి షరతులు లేకుండా వృత్తి పెన్షన్ ఇవ్వాలని బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లు గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, కల్లుగీత వృత్తిలో ఆధునీకరణను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి చూపాలని కోరారు. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, నందనంలోని నీరా తాటి ఈత ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, పెన్షన్ రూ. 4వేలకు, ఎక్స్గ్రేషియా రూ. 10 లక్షలకు పెంచాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి గౌడ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రకృతి సంపదను కాపాడాలని అన్నారు. ఈ సమాజంలో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయని, కల్లుగీత వృత్తిలో కూడా ఆధునీకరణ తీసుకురావాలని, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కోటి తాటి, ఈత చెట్ల సంపద ఉందని, ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. ప్రకృతి పానీయాలైన కల్లు, నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదని, తాటి, ఈత చెట్ల ద్వారా అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
నాటి నుండి నేటి వరకు అనేక హక్కులను సంఘం ద్వారా సాధించుకున్నామని అన్నారు. సొసైటీలు, గీచేవానికే చెట్టు పథకం, పెన్షన్, ఎక్స్గ్రేషియా, చెట్ల పెంపకానికి భూమి, నీరా కేఫ్, ప్రమాద నివారణకు సేఫ్టీ కిట్ వంటి కొన్ని సమస్యలను సాధించుకున్నామని అన్నారు. కల్లుగీత కార్మికుల కష్టాలను, సమస్యలను పరిష్కరించడానికి కల్లుగీత కార్మిక సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తుందని అన్నారు. సంఘం సీనియర్ నాయకులు పోలంపల్లి వీరబాబు, కాసాని శ్రీనివాసరావు, పోలంపల్లి వెంకటేశ్వర్లు, వి.ఎల్.ఎన్. గౌడ్, ఎరగాని లింగయ్య మాట్లాడుతూ, వృత్తి చేసే వారందరికీ కంఠమయ రక్ష (సేఫ్టీ కిట్) ఇవ్వాలని, తాటి చెట్ల పైనుండి పడిన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇవ్వాలని, తాడిచెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన గీత కార్మికులకు సభ్యత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియాలను విడుదల చేయాలని, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తాటి, ఈత చెట్లు నష్టపోయిన సొసైటీలకు, గీత కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మిరియాల శీను, గుడిపూడి వెంకటేశ్వర్లు, పోలంపల్లి నరసింహరావు, పోలంపల్లి రాజు, ఎరగాని వీరబాబు, బెల్లంకొండ లింగయ్య, మిర్యాల గురుస్వామి, మొక్క ఉపేందర్, పోలంపల్లి శ్రీకాంత్, కొంపల్లి శంకర్, గుడిపూడి శ్రీను, మండవ వెంకటేశ్వర్లు, బొల్లెపల్లి రాముడు, అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.












