తెలంగాణ, 19 November
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ 21 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజుకు 5వేల మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ 21 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజుకు 5వేల మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుత రబీ పంటకాలంతో పాటు వచ్చే వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగవచ్చని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. గతనెల 16న 20,018 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ రికార్డైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏటా మార్చి నెలలో రోజువారీ అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదవుతుంటుంది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో అక్టోబరు నెలలోనే అత్యధిక రికార్డు నమోదైంది. వచ్చే మార్చిలో ఇది 21 వేల మెగావాట్లు దాటవచ్చని విద్యుత్ పంపిణీ సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో రోజువారీగా అదనంగా పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర కరెంటు సరఫరాకు సన్నద్ధం కావాలని ప్రభుత్వం డిస్కంలకు తాజాగా ఆదేశాలు జారీచేసింది.
విద్యుత్ కొనుగోళ్లపై అంచనాలు
విద్యుత్ కొరత కారణంగా రోజువారీగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్)లో వానాకాలంలోనే 4 వేల మిలియన్ యూనిట్లను (ఎంయూ) రూ.2 వేల కోట్లకుపైగా వెచ్చించి విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేశాయి. వచ్చే వేసవిలో (ఫిబ్రవరి-మే) కనీసం 5 వేల మిలియన్ యూనిట్ల వరకైనా కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగడంతో యూనిట్ సగటు ధర ఐఈఎక్స్‌లో (ఇంధన ఎక్స్ఛేంజీల్లో) రూ.7.30కి చేరింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 6 నెలల్లో ఐఈఎక్స్ ద్వారా మొత్తం 77,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ క్రయవిక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.2 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ఒక్క సెప్టెంబరులోనే 12,220 మిలియన్ యూనిట్ల విద్యుత్ క్రయవిక్రయాలు జరగడం మార్కెట్లో పెరిగిన డిమాండ్‌ను సూచిస్తోందని ఎక్స్ఛేంజీ తాజా నివేదికలో పేర్కొంది. సెప్టెంబరు 26వ తేదీన ఒక్కరోజే 315 ఎంయూ విద్యుత్ ట్రేడింగ్ జరగడం దేశ చరిత్రలోనే అత్యధిక రోజువారీ కరెంటు కొనుగోలు రికార్డుగా ఇంధన ఎక్స్ఛేంజీ పేర్కొంది.
ముందస్తు ప్రణాళిక ఆవశ్యకత
ఎక్స్ఛేంజీ మార్కెట్లో విద్యుత్ ధరలు ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉండవు. విద్యుత్ డిమాండ్, అందుబాటులో ఉన్న సరఫరా, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి సంస్థల లభ్యత తదితర అంశాల ఆధారంగా ధరల్లో మార్పులుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే వేసవి సీజన్‌కు తెలంగాణ డిస్కంలు ఎక్స్ఛేంజీలో ఎంత కరెంటును, రోజూ ఏయే సమయంలో కొనాలనే ప్రణాళికను ముందే పక్కాగా రూపొందించుకోకపోతే భారీగా ఆర్థికభారం పెరుగుతుందని సీనియర్ విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు.







