మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో శ్రీశ్రీశ్రీ అవధూత కిషన్ ప్రభు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కొత్తపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలువురు నాయకులకు అందజేశారు.
విగ్రహ దాతలు గుత్తి బాలమని మల్లయ్య, గుత్తి రాములమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. రేవల్లి వెంకటేశ్వర శర్మ, అమృతానంద స్వామి, గురుబోధ రంగదాసు వారి చేతుల మీదుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కిషన్ ప్రభు గీత ధర్మ ప్రచార సమితి మహిళా అధ్యక్షురాలు జూలపల్లి అనసూయమ్మ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆహ్వాన పత్రికలను అందజేసి, నాయకులు, కార్యకర్తలను కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రమేష్, బ్లాక్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, సర్పంచులు పల్లె ఆనంద్, చెదరవెల్లి భాస్కర్, బీస కరుణాకర్, లంకాల సురేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశాల, శ్రావణ్ రెడ్డి, వెంకటేష్, అంజయ్య, రావుల పెంటయ్య, ప్రకాష్, బాలాజీ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఈ పవిత్రమైన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు, ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.












