రంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో మంగళవారం నూజివీడు ఆద్య సీడ్స్ ఆధ్వర్యంలో పత్తి క్షేత్ర ప్రదర్శన, రైతుల అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఆద్య పత్తి రకం పంటను రైతులు పరిశీలించారు.
గ్రామానికి చెందిన రైతులు ఆలూమ్ సందీప్ రెడ్డి, సంజీవ్ రెడ్డిలకు చెందిన 10 ఎకరాల పొలాల్లో సాగు చేసిన ఆద్య పత్తి రకం పంటను వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కంపెనీ ఆర్ఎస్ఎం శ్రీరాములు మాట్లాడుతూ, ఆద్య పత్తి రకంలో అధిక దిగుబడి సాధించడంతో పాటు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. తక్కువ సమయంలోనే మంచి దిగుబడులు సాధించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
పత్తి సాగులో ఆధునిక పద్ధతులను పాటిస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పంట ఎదుగుదల, సాగు విధానాలు, పంట పనితీరును రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తమకు ఉన్న సందేహాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించడం, సాగులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించడం ఇటువంటి సదస్సుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ టీఎం నర్సింహులు, నూజివీడు సీడ్స్ ప్రతినిధులు, కోఆపరేటివ్ డైరెక్టర్ ఏర్పుల లింగం ముదిరాజ్, ఆదర్శ రైతు మహిపాల్ రెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.












