అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఆశాకిరణంగా నిలిచారు. ప్రపంచ మార్కెట్లో కోట్ల రూపాయలు ఖర్చయ్యే టిరాట్రికాల్ () ఔషధాన్ని చాలా తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నెదర్లాండ్స్‌లోని ఒక ఫార్మసీ ప్రత్యేకంగా తయారుచేసిన ఈ మందును ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నారు.
తల్లి ఆవేదన
హైదరాబాద్‌కు చెందిన పవిత్ర సిరోల్కర్ తన కుమారుడు అరవ్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిన తర్వాత చికిత్స కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టిరాట్రికాల్ మందు యూరప్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్‌లో లభించకపోవడంతో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒక్క నెల మందుల కోసమే సుమారు రూ.1213 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. జీవితాంతం ఈ చికిత్స అవసరమయ్యే పరిస్థితిలో ఇంత భారీ ఖర్చును భరించడం సాధ్యం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఖరీదైన మందు.. అందుబాటులోకి ఎలా
ఈ సమస్యను గుర్తించిన డాక్టర్ శివరంజని సంతోష్ సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. ఆమె విజ్ఞప్తి నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ దృష్టికి వెళ్లింది. అనంతరం ఆ సంస్థ, భారతీయ రోగుల హక్కుల సంఘాలు, వైద్య నిపుణుల సహకారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నెదర్లాండ్స్‌లోని ట్రాన్స్‌వాల్ ఫార్మసీ ఈ మందును ప్రత్యేకంగా తయారుచేసేందుకు ముందుకొచ్చింది.
సాధారణంగా వాణిజ్య రూపంలో లభించే ఈ మందు చికిత్సకు ఒక్కో చిన్నారికి ఏడాదికి సుమారు రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా తయారుచేసిన మందుతో ఏడాది చికిత్స ఖర్చు ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షలకు తగ్గింది. మొదట హైదరాబాద్‌కు చెందిన అరవ్‌తో పాటు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులను గుర్తించారు. అనంతరం మరో చిన్నారిని కూడా ఈ జాబితాలో చేర్చారు.
ఉచిత చికిత్స
మొత్తం ఏడుగురికి ఏడాది పాటు మందులు ఉచితంగా అందించేందుకు అవసరమైన నిధులను భారతీయ సంస్థలు, నెదర్లాండ్స్ ఫౌండేషన్ కలిసి సమకూరుస్తున్నాయి. మందు ఆరు నెలల వరకు మాత్రమే నిల్వ ఉండటంతో రెండు విడతల్లో దిగుమతి చేయనున్నారు. విదేశాల నుంచి మందును దిగుమతి చేసుకోవడం శాశ్వత పరిష్కారం కాదని డాక్టర్ శివరంజని అభిప్రాయపడ్డారు. భారత్‌లోనే ఈ ఔషధాన్ని తయారుచేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఏడుగురు చిన్నారులకు వ్యక్తిగత దిగుమతి అనుమతులు లభించాయి. దేశీయంగా తయారీ ప్రారంభించాలంటే ప్రత్యేక నియంత్రణ అనుమతులు, అవసరమైన పరిశోధనలు, వైద్యపరమైన పరీక్షలు అవసరం. ఈ ప్రయత్నం కేవలం ఏడుగురు పిల్లలకు మందు అందించడమే కాకుండా, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న ఇతర చిన్నారులకు కూడా భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చికిత్స అందించే మార్గాన్ని చూపిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ కృషితో అరుదైన జన్యుపరమైన వ్యాధి ()తో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కోటి రూపాయల విలువైన టిరాట్రికాల్ మందును ఏడాదికి రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చారు. నెదర్లాండ్స్‌లోని ఫార్మసీతో కలిసి ఈ మందును ప్రత్యేకంగా తయారుచేయించి, ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేశారు.






