జిల్లాలోని కోరుట్ల పట్టణానికి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కొమ్ము తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు స్థానికుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త అధికారి రాకతో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, దీర్ఘకాలంగా వేధిస్తున్న పలు సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
కొత్త సీఐ కొమ్ము తిరుపతి ముందు నిష్పక్షపాత పాలన అందించడం ప్రధాన సవాల్గా స్థానికులు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, సామాన్యుడి ఫిర్యాదులకు విలువనిస్తూ, ప్రజల మధ్య ఉండే అధికారిగా పేరు తెచ్చుకోవాలని కోరుతున్నారు.
భూ వివాదాలు, మధ్యవర్తుల బెడద
పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ మోసాలు, సెటిల్మెంట్ల పేరుతో సాగే మధ్యవర్తుల పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యలపై నూతన సీఐ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
యువతలో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్లు పెరిగిపోవడంతో పాటు ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసి, క్రమబద్ధీకరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
సామాజిక రుగ్మతలపై ఉక్కుపాదం
పట్టణంలో గంజాయి విక్రయాలు, పేకాట శిబిరాలు, అక్రమ ఇసుక, మొరం రవాణా వంటి ఆరోపణలపై నూతన సీఐ ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని కోరుతున్నారు.
కొత్త అధికారి రాకతో కోరుట్లలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా రక్షణకు భరోసా లభిస్తుందని, సామాన్యుడికి రక్షణగా నిలిచే పోలీస్ శాఖను తీర్చిదిద్దుతారని కోరుట్ల ప్రజలు ఆశిస్తున్నారు.












