Nalgonda/Nalgonda (ధర్మ రథం) ఆగస్టు 01
తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో గ్రామస్తులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య గ్రామ సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పజ్జూరు, ఎర్రగండ్ల గూడెం మధ్య 30 కోట్ల రూపాయలతో 132 కేవీ సబ్ స్టేషన్, 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో గ్రామస్తులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై మాట్లాడుతూ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పజ్జూరు, ఎర్రగండ్ల గూడెం మధ్యలో 30 కోట్ల రూపాయలతో 132 కేవీ సబ్ స్టేషన్ ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక పజ్జూరు గ్రామానికి 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 132 కేవీ సబ్ స్టేషన్ ద్వారా చుట్టుపక్కల 10 గ్రామాలలో విద్యుత్ సమస్య ఉండదని, అంతేకాక స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని, పజ్జూరు గ్రామంలో ఇంకా ఇండ్లు రాని వారి కోసం స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేయాలని, ఇండ్లు లేని వారందరికీ అక్కడ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామానికి ఇదివరకే 30 ఇండ్లు మంజూరయ్యాయని, ఎర్రగడ్డలగూడెంలో బోర్లు కావాలని, డ్రైనేజీ సమస్య ఉందని, విద్యుత్ సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా, మూడు కోట్ల రూపాయలతో గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎల్ నినో కారణంగా గ్రామంలో విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయని, ఒకవేళ ఇప్పటి వరకే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయి ఉంటే ఈ ప్రాంతం మొత్తానికి సాగు నీరు అంది రెండు పంటలు పండేవని, గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉండేవి కాదని అన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించడమే తన ఆశయమని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని, గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి లింకు రోడ్లన్నింటిని వేస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ప్రతి గూడెంకు బీటి రోడ్డును వేస్తామని తెలిపారు. ఎర్రగడ్డలగూడెంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వెంకటాద్రిపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి పరిశీలించారు. ఇండ్లూరు గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామానికి 63 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్లు బాగుంటే అభివృద్ధి అవుతుందని, ప్రజలకు ప్రయాణ సౌకర్యం తో పాటు, పరిశ్రమలు, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా హ్యం రోడ్లు చేపట్టినట్లు చెప్పారు. అంతేకాక మరో 7 వేల కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బీ రోడ్లు చేపట్టామని వెల్లడించారు. ఇండ్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మామిడాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు.
అంతకుముందు ఎర్రగడ్డల గూడెంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని, నల్గొండ జిల్లాలో ఇదివరకే 60 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డుతో పాటు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు.









