మండలంలోని భూపతిపూర్ గ్రామంలో రెండవ రోజు శిక్షణలో భాగంగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి పర్యటించారు. గ్రామంలోని ఫామ్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి మాట్లాడుతూ, రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని భూగర్భ జలాల పెంపునకు దోహదపడవచ్చని తెలిపారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ ద్వారా పండ్ల మొక్కలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్ పిట్లను పరిశీలించి, వాటి ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నీటి సంరక్షణపై గ్రామ ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
అనంతరం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, పాఠశాల వాతావరణం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపతిపూర్ గ్రామ సర్పంచ్ గుర్రం భావన మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ మూగల సంజీవ చారి, పంచాయతీ కార్యదర్శి ఆదిత్య రాజ్, టీఏ విజయ్, మహేష్తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.












