జగిత్యాల నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులను కల్పించేందుకు అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు. విద్యార్థులకు మంజూరైన పుస్తకాలు, యూనిఫామ్ తో పాటు ఇతర అవసరమైన సామాగ్రి విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి కె.వై. ప్రసాద్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నరేశ్, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.












