విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన రక్షణ, ప్రాథమిక చికిత్స, అత్యవసర స్పందన నైపుణ్యాలపై నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా జగన్నాథ్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఉపాధ్యాయురాలు వేల్పుల శిరీష పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో ఈ శిక్షణ జరుగుతోంది.
విపత్తులు, అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన రక్షణ, ప్రాథమిక చికిత్స, అత్యవసర స్పందన నైపుణ్యాలపై నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా జగన్నాథ్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఉపాధ్యాయురాలు వేల్పుల శిరీష పాల్గొంటున్నారు.
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్ టీజీఎస్పీలో ఈ నెల 22 వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్.డి.ఆర్.ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్.డి.ఆర్.ఎఫ్ నిర్వహిస్తోంది.
శిక్షణలో భాగంగా వివిధ రకాల విపత్తులు, ప్రమాదాల సమయంలో తక్షణమే స్పందించి బాధితులను సురక్షితంగా రక్షించే విధానాలపై శిక్షణ అందిస్తున్నారు.
అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, చెరువులు, బావులు, నీటి ప్రవాహాల్లో ప్రమాదవశాత్తు పడిన వ్యక్తులను రక్షించే పద్ధతులు, భవనాలు, అపార్ట్మెంట్లు, పెద్ద నిర్మాణాలు కూలినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించే ప్రాథమిక మెళకువలను శిక్షణలో బోధిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రాథమిక చికిత్స, సిపిఆర్, రక్షణ పరికరాల వినియోగం తదితర అంశాలపై సైద్ధాంతికంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తలకు గాయాలకు బ్యాండేజ్ వేయడం, చేతి గాయాలకు స్లింగ్ అమర్చడం, కాళ్లకు స్ప్లింట్లు వేయడం, గుండె ఆగిన సందర్భంలో మ్యానెకిన్పై సిపిఆర్ చేయడం వంటి ప్రాణరక్షణ పద్ధతులను ప్రత్యక్షంగా అభ్యసిస్తున్నారు.
విపత్తుల సమయంలో రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో రక్షకుడి భద్రత, బృంద సమన్వయం, అత్యవసర సమాచార మార్పిడి, బాధితులకు తక్షణ ప్రాథమిక సహాయం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు.
భవిష్యత్తులో విపత్తులు సంభవించినప్పుడు సంబంధిత విపత్తు నిర్వహణ, రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా స్పందించేలా యువ ఆపద మిత్రలను సిద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా తాను నేర్చుకుంటున్న రక్షణ నైపుణ్యాలను భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నానని వేల్పుల శిరీష తెలిపారు.












