నాంపల్లి, 2026-09-04
ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం (2026, ) నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీలో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ సమావేశంలో పాల్గొన్న ఆమె, ముఖ్యమంత్రి ప్రకటనలను తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం కొరివితో తలగొట్టుకోవడమేనని, ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు శుక్రవారం (2026, ) ఉదయం 11 గంటలకు తెలంగాణ మీడియా అకాడమీ, నాంపల్లిలో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ జంగ్ సైరన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మెదడు ఉన్నవాడు ఇంటర్మీడియేట్ విద్యను తీసేయాలని అనడు. ఇంటర్మీడియేట్ విద్య ఎంతో బలంగా ఉంది, దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఇంటర్మీడియేట్ విద్యను తీసేయాలనుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే. ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు.
తాను ఇంటర్మీడియేట్ విద్య కారణంగా ఎంతో ప్రయోజనం పొందిన వ్యక్తిని అని, మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగానే ఇంటర్ విద్య వచ్చిందని కవిత పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియేట్ విద్య ఎంతో మెరుగ్గా ఉందని, అందుకే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో గొప్ప ఇంజనీర్లంతా మనవాళ్లే ఉన్నారని తెలిపారు. ఇంటర్ విద్య చాలా బాగుందని, దాన్ని మరింత బలోపేతం చేయాలని, కానీ తీసేయాల్సిన అవసరమే లేదని అన్నారు.
ఎలాంటి సమస్య లేనప్పుడు దాన్ని సమస్యగా మార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని కవిత అన్నారు. ఇప్పుడున్న కార్పొరేట్ విద్యలో కొన్ని లోపాలు ఉండొచ్చని, కానీ ఇంటర్ విద్య కారణంగానే మనం ప్రపంచంలోనే మేధావులను తయారు చేయగలిగామని తెలిపారు. కచ్చితంగా ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే భయమేస్తుందని, వైట్ కాలర్ జాబ్స్ వదిలేసి బ్లూ కాలర్ జాబ్స్ వెతుక్కోవాలని ఆయన అంటున్నారని కవిత విమర్శించారు. ఇంజనీరింగ్ వేస్ట్ అంటారని, ఐటీఐ, పాలిటెక్నిక్ తేసేస్తామంటారని, విదేశాల్లో బ్లూ కాలర్ జాబ్స్ అంటే లేబర్ ఉద్యోగాలు వెతుక్కోవాలని చెబుతారని అన్నారు. ప్రభుత్వాల ఆశయాలు ఉన్నతంగా ఉండాలే తప్ప పాతాళం అంత లోతుగా ఉండొద్దని, ఉద్యోగాలు కల్పించే వ్యాపారవేత్తలను తయారు చేయాలే గానీ ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్లను కాదని సూచించారు.
ముఖ్యమంత్రి అనుసరిస్తున్న పోకడను కచ్చితంగా వ్యతిరేకించాలని కవిత అన్నారు. ఇంటర్మీడియేట్ విద్యను కాపాడాలని పోరాటం చేస్తున్న మధుసూదన్ రెడ్డి గారిని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, ఆయన ధైర్యంగా పోరాటం చేశారని, ఆయనతో కలిసి ఉద్యమంలో తాను పనిచేశానని తెలిపారు. ఒక వ్యవస్థను కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని, అందరికీ మంచి జరుగుతుందని గట్టిగా నమ్మితేనే పోరాటం చేస్తానని, మొండిదాన్ని అయినప్పటికీ ప్రజలకు మంచి జరిగే విషయంలో గట్టిగా పోరాటం చేస్తానని చెప్పారు.












