హనుమకొండ, 2026-08-07
జనగణన2027లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను పూర్తి ఖచ్చితత్వంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆమె సూచనలు జారీ చేశారు.
జనగణన2027లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను పూర్తి ఖచ్చితత్వంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో జనగణన2027 పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు.
సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల వివరాల సేకరణ
గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్, పోస్టల్, వ్యవసాయం, మార్కెటింగ్ తదితర సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని భారతి హోళ్లికేరి సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించడంతో పాటు, సంబంధిత శాఖల రికార్డులతో వివరాలను ధృవీకరించి నమోదు చేయాలని తెలిపారు.
డేటా భద్రతకు ప్రాధాన్యత
డేటా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారిక యాప్, వెబ్ పోర్టల్‌నే వినియోగించాలని, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి, డి ఆర్ డి ఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారం
అనంతరం అధికారులతో ఇంచార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ జనగణన హ్యాండ్‌బుక్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు కీలకమైన ప్రామాణిక సమాచార వనరుగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వివరాల సేకరణ, నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యం
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిడబ్ల్యూఎంసి సిపి రవీంద్ర రాడేకర్, డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, డిఐఈఓ గోపాల్, డిడబ్ల్యూఓ విశ్వజ, మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులు, పరిశ్రమల శాఖ జిఎం నవీన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












