జిల్లాలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో, మండప నిర్వాహకులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో దుర్గా దేవి మండపాలు, దేవాలయాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలు, రావణ దహనం జరిగే ప్రదేశాలు, ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
దుర్గా దేవి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన ://.../ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. భద్రత, బందోబస్తు కొరకే ఈ ఆన్లైన్ నమోదు విధానం అమలు చేస్తున్నామని, దీని ద్వారా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మండపాలను ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, మండపాలకు పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మండపంలో 24 గంటలు నలుగురు వాలంటీర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తతో ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రమ్ముల్లో నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
మండపాలకు వచ్చే భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని, మండపాల్లో మరియు శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డీజేలను ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మండపాల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పోలీసు వారికి ముందుగానే తెలియపరచాలని, తద్వారా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతనిచ్చే పోలీస్ శాఖ, మండపల వద్ద, శోభాయాత్రలో మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీసు వారు సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరగడానికి పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ అశోక్ కుమార్ ప్రజలకు, నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.












